ఏ 2 టీవీ న్యూస్ మార్చి 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వరి పంటలను పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారితో కలిసి పొలాల్లో పంట స్థితిని పరిశీలించిన అనంతరం రైతులతో కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండిస్తున్న ప్రతి పంటను ప్రభుత్వ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అలా చేస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలిపారు. అక్కడ ఉన్న రైతులు యూరియా ఎరువు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని రంగంపేట, ఎనగండ్ల గ్రామాల్లో కొంతమంది ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలు రెండు రోజుల క్రితం యూరియా బస్తాను రూ.300కి విక్రయించినట్లు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుని యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ శ్రీనివాసాచారికు సమాచారం ఇచ్చారు. సోమవారం రంగంపేటలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారితో కలిసి అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో రిజిస్టర్లలో తప్పులు ఉన్నట్లు గుర్తించినందున కొద్ది రోజులపాటు ఆ ఫర్టిలైజర్ దుకాణాలను మూసివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

