మత్తు పదార్థాలను నియంత్రించాలి
– రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించొద్దు
– మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా చర్యల సమర్థ అమలు, మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ, మత్తు పదార్థాల నిర్మూలన కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అవసరమైన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టులు వినియోగించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.అదేవిధంగా జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, చట్టవిరుద్ధంగా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన అంశాల్లో ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ వేణు, డీఎస్పీలు, జిల్లా రవాణా శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

