ఏ2టీవీ న్యూస్, మార్చి11, మెదక్ జిల్లా ప్రతినిధి రాము
మెదక్ జిల్లా హావేలీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిశువును అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది.హావేలీఘనపూర్ మండలం లింగసాస్ పల్లి తాండకు చెందిన కేతావత్ మంజుల, ఆమె భర్త మహేష్ దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఒక నెల మగ శిశువును అమ్మినట్టు పోలీసులు తెలిపారు.మంజుల నెల రోజుల క్రితం మెదక్ మాతా–శిశు సంరక్షణ కేంద్రంలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే గత వారం రోజులుగా అంగన్వాడీ కేంద్రంలో లభించే అనుబంధ పోషకాహారం కోసం మంజుల రాకపోవడంతో అంగన్వాడీ టీచర్ ఆమె ఇంటికి వెళ్లి విచారించింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఈ విషయాన్ని ఐసిడిఎస్ సెక్టార్ ఇంచార్జ్ పర్ల విజయలక్ష్మికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మార్చి 4న మెదక్ పట్టణంలోని కీర్తి టేకర్ వద్ద మంజుల, ఆమె భర్త మహేష్ కలిసి హావేలీఘనపూర్‌కు చెందిన కుమ్మరి నాగరాజు, అతని భార్య స్వప్నతో తమ మగ శిశువును అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. మొదట ఐదు లక్షల రూపాయలకు మాట్లాడుకున్నప్పటికీ, చివరకు ఒక లక్ష యాభై వేల రూపాయలకు బేరం కుదిరింది. అనంతరం హావేలీఘనపూర్ మండలం శాలిపేట గ్రామ శివారులో స్టాంప్ పేపర్‌పై ఒప్పందం రాసుకొని దంపతులు సంతకాలు చేసి శిశువును వారికి అప్పగించారు. మార్చి 9న చేగుంట బస్ స్టాప్ వద్ద ఉన్న మంజుల, మహేష్‌లను ఐసిడిఎస్ సెక్టార్ ఇంచార్జ్ పర్ల విజయలక్ష్మి గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీసులు విచారణ జరపగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ శిశువును అమ్మినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.తర్వాత మధ్యవర్తులైన కుమ్మరి నాగరాజు, అతని భార్య స్వప్నలను పోలీసులు విచారించగా, కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన నరసొల్ల రాజు, అతని భార్య నరసొల్ల స్వప్నకు పిల్లలు లేకపోవడంతో వారికి శిశువును అప్పగించినట్టు వెల్లడించారు. దీంతో ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలిసి భిక్నూర్ మండలం కంచర్ల గ్రామానికి వెళ్లి నరసొల్ల రాజు వద్ద నుంచి మగ శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శిశువును సఖి కేంద్రం ద్వారా తల్లి కేతావత్ మంజులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

