ఏ2టీవీ న్యూస్, మార్చ్13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తలు పూర్తిగా అపోహలేనని శుక్రవారం తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్రంలో బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులకు సరిపడా ఎల్‌పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్లే కృత్రిమ కొరత వాతావరణం సృష్టించబడుతోందని అన్నారు.అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.మెదక్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

