“సజీవంగా చేరుకోండి” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన
ఒక్కరి నిర్లక్ష్యం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ఏ2టీవీ న్యూస్, మార్చి 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)


శంకరంపేట్-ఆర్ మండలంలో మంగళవారం ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సజీవంగా చేరుకోండి” కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఒక్కరి నిర్లక్ష్యం మొత్తం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా వివరించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాల శాతం పెరుగుతోందని, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.గత ఏడాది జిల్లాలో నిర్వహించిన వాహన తనిఖీల ద్వారా 69 మరణాలను నివారించగలిగామని తెలిపారు. లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.కుటుంబ యజమానిని కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. “ప్రమాదం చెప్పి రాదు.. జాగ్రత్తే దానికి విరుగుడు” అని ఎస్పీ పేర్కొన్నారు.

