ఏ2టీవీ న్యూస్ మార్చి 21 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన రైతు ఉత్సవాల్లో మెదక్ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె వివరాల ప్రకారం, మెదక్ జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన రైతులను నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో జరుగుతున్న రైతు ఉత్సవాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా తరలించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే కార్యక్రమం తొలి దశలో భాగంగా మార్చి 20న 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను 10 బస్సుల ద్వారా తరలించగా, మార్చి 21న మరో 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను కార్యక్రమ స్థలానికి పంపినట్లు వెల్లడించారు.ఈ ఉత్సవాల్లో పాల్గొన్న రైతులు వ్యవసాయ మరియు అనుబంధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో సాంకేతిక చర్చలు జరిపి ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పొందారు. అలాగే ఉత్తమ రైతుల అనుభవాలను తెలుసుకుని తమ వ్యవసాయంలో అమలు చేయదగిన పద్ధతులను అవగాహన చేసుకున్నట్లు తెలిపారు.అదనంగా, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ శాఖలకు చెందిన అధునాతన సాంకేతిక ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటున్నారని పేర్కొన్నారు.ఇక మార్చి 22న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు ఆయిల్ ఫామ్ రిఫైనరీ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రైతులను పెద్ద ఎత్తున తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

