ఏ2టీవీ న్యూస్, మార్చి27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్, శుక్రవారం:మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. వదంతులను నమ్మకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఎల్పిజి గ్యాస్ సరఫరా సమృద్ధిగా కొనసాగుతోందని తెలిపారు. రోజుకు సుమారు 3000 సిలిండర్లు బుక్ అవుతుండగా, వాటికి 100 శాతం డెలివరీ జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని గ్యాస్ గోదాముల్లో సుమారు 3500 సిలిండర్లు నిల్వ ఉండగా, మరో 6500 సిలిండర్లు రవాణాలో ఉన్నాయని వివరించారు.అలాగే జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బంకులు, 16 ఎల్పిజి ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రోజువారీ అవసరానికి సరిపడా ఇంధనం నిల్వలో ఉందని, ప్రస్తుతం 550 కిలోలీటర్ల పెట్రోల్, 644 కిలోలీటర్ల డీజిల్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.కొన్ని బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల ప్రభావంతో ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్లే ఏర్పడుతున్నాయని చెప్పారు. అవసరం ఉన్నప్పుడే ఇంధనం తీసుకోవాలని సూచించారు.అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్, పోలీస్, రెవెన్యూ శాఖల సంయుక్త బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మెదక్ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేసి గృహ వినియోగానికి ఉద్దేశించిన 14.2 కేజీల 134 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి, 83 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ప్రజలు సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే నిర్ధారణలేని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని కలెక్టర్ సూచించారు.ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9391942254 ను సంప్రదించవచ్చని తెలిపారు.“వాస్తవాలను గ్రహిద్దాం… ఆందోళనను వీడుదాం. అవసరానికి మించి నిల్వలు చేయవద్దు” అని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

