ఏ2టీవీ న్యూస్, మార్చి 27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఊరురా, వాడవాడలా ఘనంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా పేర్గాంచిన దేవాలయాలు మొదలుకొని ప్రతి గ్రామంలోని హనుమాన్ ఆలయాల్లో సైతం శ్రీరాములవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. గ్రామ పెద్దలు, ఆలయ నిర్వహకులు గత రెండు రోజుల నుండి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పచ్చటి పందిళ్లు వేసి మండపాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. శుక్రవారం సీతారాముల కళ్యాణం పండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా జరిగింది. ఈ మేరకు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో రామాలయం, నర్సాపూర్ పట్టణ పరిధిలోని సీతారాంపూర్ దేవాలయం, కొల్చారం మండలం రంగంపేట రంగనాయక స్వామి దేవాలయం, మండల కేంద్రమైన కౌడిపల్లి లోని రామాలయం, శివంపేట మండలం దొంతి దేవాలయం, చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయం, చేగుంట మండలం పులిమామిడి గుట్ట రాములవారి దేవాలయం, రామయంపేట, తూప్రాన్ తదితర పట్టణాల్లో శ్రీరాముల వారి కళ్యాణం కమనీయం, రమణీయం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

