Thursday, May 7, 2026

సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన

ఏ2టీవీ న్యూస్, మార్చి 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా శంకరంపేట-ఆర్ మండలం జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై జరిగిన దాడి–దోపిడీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్‌తో దాడి చేసి వారి ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఫిర్యాదు మేరకు కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడు వరిగే వెంకట నారాయణ (40)ను శనివారం ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి 2½ తులాల పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం ఉంగరం సహా మొత్తం 4½ తులాల బంగారం, (టీవీఎస్ ఎక్స్ఎల్ ) వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు వేగంగా స్పందించి కేసును ఛేదించగా, సంబంధిత పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రజలు అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular