ఏ2టీవీన్యూస్, మార్చి 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో రోడ్లపై పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించి ప్రతి వాహనదారుడు సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, వీధి దీపాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేసి, రోడ్లపై గుంతలు పూడ్చి పెండింగ్ పనులు లేకుండా చూడాలని ఆదేశించారు.విద్యాసంస్థల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి అని తెలిపారు.మత్తు పదార్థాలపై నిఘా పెంచాలని, యువత భవిష్యత్తు దెబ్బతినకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. విద్యాసంస్థలు, మెడికల్ షాపులు, పరిశ్రమల వద్ద మత్తు పదార్థాలపై కఠిన నిఘా కొనసాగుతోందని చెప్పారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

