ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు కీలక సూచనలు చేశారు.రామాయంపేట ప్రభుత్వ పాఠశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పరిశీలించిన ఆయన, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తదుపరి రామాయంపేట ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని సూచించారు. స్టాక్ వివరాలను తెలుసుకుంటూ పంపిణీ వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు.నిజాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. రోగులకు అవసరమైన పరీక్షలు ఉచితంగా అందించాలని సూచించారు.అనంతరం నిజాంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన నగేష్, భూ భారతి మరియు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. భూ సర్వే, ఇసుక సమస్యలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

