తప్పదంటున్న శాస్త్రవేత్తలు
వాతావరణంలో విపరీత మార్పులు
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తిరాంచందర్)
భారతదేశంలో ఎల్ నినో ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చి చెబుతున్నారు. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వేడెక్కి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడి వాతావరంలో విపరీత మార్పులు చేసుకుంటా యని వాతావరణ పరిశోధకులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అసలు ఎల్ నినో అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకుందాం. ఈ భూమి మీద అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణ రీతిలో వేడెక్కడం ఎల్ నినోగా పేర్కొంటారు. ఇది అప్పుడప్పుడు సంభవించే ఒక సహజ వాతావరణ మార్పు. 80, 90 ల దశకంలో కూడా వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. కాకపోతే అప్పుడు అటవీ విస్తీర్ణం తగినంత ఉన్నందున పెద్దగా ఆ మార్పులు ఏర్పడలేదు. దీనివల్ల ప్రపంచ గాలుల దిశలు మారి ఋతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఓవైపు కరువు, ఓవైపు విపరీతమైన వర్షాలు, మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో వేడెక్కడం ఈ ప్రక్రియలో జరిగే మార్పులు. ఎల్ నినో వల్ల ఋతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గి కరువు ఏర్పడే పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపి ఆహార ఉత్పత్తి తగ్గుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల వేటపైన ప్రభావం పడుతుంది. వరదల మాటేమో గాని వడగాల్పులు తీవ్రత పెరిగి వాతావరణంలో ఊహించిన మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం మన ఒక్క దేశం వైపే కాదు దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరువు వచ్చే అవకాశం ఉన్నందున వాతావరణం అల్లకల్లోలం కానునందున ఇప్పటినుండే సిద్ధంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం మన దేశంపై పడనుందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. జూలై ఆగస్టులో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చనీ, దేశంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు పెరిగాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. 2025 వరకు తటస్థంగా ఉన్న ఈ ఎల్ నినో ప్రభావం 2026 ప్రారంభం నుంచి క్రమంగా బలపడుతుందని, ఈ సంవత్సరం అత్యంత వేడిగా ఉండే సంవత్సరాలలో చరిత్రలో ఒకటిగా నిలబడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. 2027 వరకు ఇది కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో బోర్లపైనే ఎక్కువ శాతం ఆధారపడతాం కాబట్టి భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో ఇంకా కుండా చూసుకోవాలని జియాలజిస్టులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా పంటలు సాగు చేసేలా ప్రోత్సహించి కరువు ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండలు అధికంగా కొడుతున్నందున ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.

