
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న మండల కేంద్రాలు, మున్సిపాల్టీల సభలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా జరుగనున్న ఈ సభలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలని గూగుల్ మీట్ ద్వారా సూచించారు. సభ ప్రాంగణాల్లో నీడ, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని, గ్రామ సభల అర్జీలను ముందుగానే పరిష్కరించాలని సూచించారు. సభల్లో రాష్ట్ర గేయంతో ప్రారంభం చేసి, “అరైవ్-అలైవ్” కార్యక్రమంపై అవగాహన కల్పించాలని తెలిపారు.వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేయాలని ఆదేశించారు.అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు పొందాలని, అవసరమైతే 108 సేవలను వినియోగించాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

