ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)


మెదక్, శుక్రవారం: పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని, ప్రతి సర్పంచ్ గ్రామానికి నాయకుడిగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాల్లో త్రాగునీటి సమస్యలను పూర్తిగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై వర్క్‌షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని గ్రామపంచాయతీలను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామాల్లో పనులు సవ్యంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇతర శాఖల అధికారులతో సమన్వయం పెంచాలని సూచించారు.నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేస్తూ, నిధులు సక్రమంగా వినియోగించకపోతే సర్పంచ్‌లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా వేసవికాలంలో త్రాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఈఈ మిషన్ భగీరథ సంపత్ కుమార్, గ్రిడ్ డిఈ నాగభూషణం, డిఎల్పీఓలు సాయి బాబు, తిరుపతి రెడ్డి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

