
వసతి గృహాల్లో రోజువారీ కార్యక్రమాలకు పటిష్ట ప్రణాళిక
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో 7 రోజులపాటు నిర్వహించనున్న సంక్షేమ వారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎంపీడీవోలు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్‌సీఓలతో కలిసి కార్యక్రమాల అమలుపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వారాన్ని పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను స్పష్టంగా రూపొందించి అమలు చేయాలని సూచించారు.జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు మరియు వసతి గృహాల్లో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులను చేపట్టాలని, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల కోసం క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ వంటి పోటీలు నిర్వహించాలని సూచించారు.ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి వసతులపై చర్చించాలని తెలిపారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.ఇందిరమ్మ గృహప్రవేశాలు మరియు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాలు కూడా సంక్షేమ వారంలో భాగంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

