శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా రామాయంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన స్నేహితుడి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదేవిధంగా చెరో రూ.15,000 చొప్పున మొత్తం రూ.30,000 జరిమానా కూడా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. డి. ధర్మారం గ్రామానికి చెందిన నరేందర్ తన స్నేహితులు పిట్ల పరుశురాములు, చెవిటోల్ల చంద్రంతో కలిసి తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో వారిమధ్య తలెత్తిన విభేదాలు తీవ్రరూపం దాల్చి, క్షణిక ఆవేశంలో నిందితులు నరేందర్‌పై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని చెక్‌డ్యాంలో పడేసి ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించారు.ఈ ఘటన 2022 మే 4న వెలుగులోకి రావడంతో రామాయంపేట్ పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, సాక్షులను విచారించి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.ప్రస్తుతం కేసు దర్యాప్తు బాధ్యతలు నిర్వహించిన ఐఓ వెంకట రాజా గౌడ్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితులు నేరం చేసినట్లు నిర్ధారించి ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు చెరో రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసులో కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ భూపాల్ సహకరించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

