
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమకు నచ్చిన రంగాలలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారంలో, శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి పథకాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన వివిధ కళాశాలల యువతకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు సాంకేతిక మరియు వ్యవస్థాపక నైపుణ్యాలలో ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో, యువత కంప్యూటర్ కోర్సుల్లో ప్రావీణ్యం సాధించి పోటీ ప్రపంచంలో నిలబడాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.అంతకుముందు ఐటీసీ సంస్థ ప్లాంట్ మేనేజర్ ఆనంద్, టెక్నీషియన్ శివయ్య నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందే విధానంపై వివరించారు. ఐటీసీ సంస్థలో 50 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల యువత నుండి అర్హత పత్రాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

