
ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్‌లో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎంపికైన ఇంటర్న్‌లకు నెలకు కనీసం ₹9,000 ఆర్థిక సహాయం, అదనంగా ₹6,000 పాకెట్ మనీ అందిస్తారని తెలిపారు.భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో వివిధ రంగాలలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, పైలట్ దశలో ఇప్పటికే 300కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. ప్రస్తుతం ఈ పథకం మూడవ దశ కొనసాగుతుండగా, కంపెనీలు నిరంతరం కొత్త అవకాశాలను ప్రకటిస్తున్నాయని చెప్పారు.18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల, పదో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన అర్హులైన యువత అధికారిక వెబ్‌సైట్ (www.pminternship.mca.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. యువత తమ కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్ రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

