ఏ2డిజిటల్ న్యూస్, మే3, నర్సాపూర్ ప్రతినిధి (రాoచందర్)
ఇల్లంతా సందడిగా తిరుగుతూ వేసే గింజలను తింటూ కనువిందు చేసే ఊర పిచ్చుకలు కనుమరుగు కానున్నాయా అంటే తాజా గణాంకాలు అవుననే అంటున్నాయి. సెల్ టవర్, కాంక్రీట్ జంగల్ వీటికి శాపంగా మారి గత ఐదేళ్లలో 97 శాతానికి నశించిపోయినట్లు ఓ సర్వే తేల్చి చెప్పడం దారుణం. ఇంట్లో మనుషులతో సమానంగా తిరుగుతూ గోల చేసే ఈ చిన్న ప్రాణి ఇక జ్ఞాపకంగా మారనుంది అంటే పకృతి ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవి సమూహాలుగా జీవిస్తూ ధాన్యం గింజలు చిన్నచిన్న పురుగులను ఆహారంగా తింటూ ఇంటి వాసాలు, పగులు వచ్చిన గోడలు, పాత ఇండ్లలో గూడు కట్టుకుంటూ జీవం సాగిస్తుంటాయి. వీటికి ముఖ్యంగా సెల్ టవర్ నుంచి వచ్చి రేడియేషన్ కు ఇవి విలవిలలాడి అంతరించిపోతున్నాయి. మనిషి అభివృద్ధి, టెక్నాలజీ పేరిట వీటికి మరణశాసనం రాస్తుండనే చెప్పాలి. ఏ పక్షులకు లేని సాన్నీహిత్యం ఊర పిచ్చుకలతో ఉంది దీనికి సంబంధించిన ఓ చిన్న కథ కూడా పెద్దలు చెప్పేవారు. మనిషికి మూడు పూటలా అన్నం పెట్టమని ఈ ఊర పిచ్చుక బ్రహ్మ దేవుని కోరిందట దానికి ఫలితంగా నీవేమిస్తావని బ్రహ్మదేవుడు అడగగా నా నడకను త్యాగం చేస్తానని చెప్పిందట అందుకే ఊర పిచ్చుకలు మామూలు మిగతా పక్షులాగా నడవవు. దూకినట్లు నడవడం లేదంటే ఎగరడం ఆ కథలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ పక్షులు ఇంట్లోకి వస్తే మంచిదని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పూర్వకాలంలో వడ్ల గింజలు, చిరుధాన్యాల గింజలతో ఉన్న కంకులను వీటి కోసం గుమ్మానికి మరీ కట్టేవారు. అవి స్వేచ్ఛగా ఇంట్లోకి వచ్చి వాటిని తింటూ ఇల్లంతా తిరిగినా వాటికి ధాన్యపు గింజలు పెట్టడం తమ బాధ్యతగా భావించేవారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి వీటికి నిలవ నీడ లేకుండా పోయింది. ఇవి మిగతా పక్షుల లాగా అడవుల్లో బతికేంత స్థాయి కాదు. రైతులను ఆధారం చేసుకుని వీటి ప్రాధాన్యత గుర్తించిన వాళ్ళ ఇండ్లనే ఆవాసంగా చేసుకుంటూ బతికే జీవి. ఇప్పుడు ప్రస్తుతం సెల్ ఫోన్ టవర్ల కారణంగా చెట్ల నరికివేత కారణంగా మనుషులకు వీటికి ఉన్న బంధం దూరమై గడచిన ఐదేళ్లలో వీటి సంఖ్య సెల్ టవర్ల కారణంగా తొంబై ఏడు శాతానికి పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఇవి ఉన్న కొన్ని ప్రదేశాల్లోనైనా బతికేందుకు వీలుగా కృత్రిమ గూళ్లను, ధాన్యపు గింజలు అవి ఉండేందుకు అనువైన వాతావరణం సృష్టిస్తే వీటిని బతికించుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే అంతరించిపోయే జీవుల జాబితాలో ఇవి చేరడం పక్క. ఇలాంటి రోజులు రాకుండా మళ్ళీ వీటికి పూర్వవైభవం రావాలని మనమూ కోరుకుందాం.

