ఏ2డిజిటల్ న్యూస్, మే 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిశాయి.జిల్లాలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 465 మంది హాజరై పరీక్ష రాశారు. 15 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, బయోమెట్రిక్ వ్యవస్థను పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు, గైర్హాజరు శాతం తదితర అంశాలను వారు సమీక్షించారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్విజిలేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు.మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, పరీక్షా కేంద్ర నిర్వాహకులు, పోలీసు అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


