
ఏ2డిజిటల్ న్యూస్, మే 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రైతులు అధిక ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల సందర్భంగా సోమవారం కౌడిపల్లి రైతు వేదికలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంప్రదాయ పంటలతో పాటు కూరగాయలు, పూల మొక్కల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఇప్పటికే కౌడిపల్లి, చేగుంట, తూప్రాన్ ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఈ దిశగా సాగు చేస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వల్ల పంటలను మార్కెట్ చేయడం సులభమని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారోత్సవాలు–2026” కార్యక్రమం జిల్లాలో మే 4 నుండి మే 9 వరకు అన్ని మండలాలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో ప్రతి గ్రామంలోని రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికల ద్వారా సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, స్థానిక వ్యవసాయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

