బాధితులకు భరోసా కల్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
ఏ2డిజిటల్ న్యూస్, మే 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా వినిపించారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సమస్యలపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని ఎస్పీ స్పష్టం చేశారు. చట్టపరమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు.ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.

