సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ నగేష్

ఏ2డిజిటల్ న్యూస్, మే 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్ర నిర్వాహకులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, ఇప్పటివరకు కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చిందీ, ఎంతమంది రైతులకు టోకెన్లు జారీ చేశారో, ఎంత మేర కొనుగోలు పూర్తయ్యిందో అడిగి తెలుసుకున్నారు. అలాగే లారీలు వచ్చే సమయం, లోడింగ్ – అన్‌లోడింగ్ ప్రక్రియకు పడుతున్న సమయం వంటి వివరాలను పరిశీలించారు.ధాన్యం రవాణాలో ఆలస్యం జరగకుండా చూడాలని, లారీతో పాటు కేంద్ర నిర్వాహకుల తరఫున ఒక ప్రతినిధి తప్పనిసరిగా మిల్లుకు వెళ్లి ధాన్యం త్వరగా అన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గానీ, మిల్లుల వద్ద గానీ ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణ చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు రైతుల నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 14 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.52 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు.రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన లేబర్, లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని, నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే మిల్లర్లు ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

