
ఏ2డిజిటల్ న్యూస్, మే8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ వేగవంతం అవుతోంది.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పందనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.ధర్మసాగర్ గేటు వద్ద స్వయంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పర్యవేక్షణలో వరి ధాన్యాన్ని తరలించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు.శుక్రవారం కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చిందీ, ఎంతమంది రైతులకు టోకెన్లు జారీ చేశారో, ఎంత మేర కొనుగోలు జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.లారీలు సమయానికి రావాలని, లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.ట్రక్‌తో పాటు నిర్వాహకుల ప్రతినిధి తప్పనిసరిగా వెళ్లి మిల్లుల్లో ధాన్యం త్వరగా అన్‌లోడ్ అయ్యేలా చూడాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో గానీ, మిల్లుల వద్ద గానీ సమస్యలు తలెత్తితే వెంటనే రాతపూర్వకంగా తెలియజేయాలని రైతులకు తెలిపారు.సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు కలెక్టర్ నగేష్…ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, 14 వేల మంది రైతుల ఖాతాల్లో 52 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు.రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని రక్షించేందుకు టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.లోడింగ్ ప్రక్రియను వేగంగా చేపట్టాలని, అవసరమైన లేబర్, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా చూడాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఆదేశించారు.మిల్లర్లు కూడా ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

