ఏ2డిజిటల్ న్యూస్, మే 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రైతుల సంక్షేమమే లక్ష్యంగా మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలో ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ అంశాలపై చేపడుతున్న చర్యలను వివరించారు.జిల్లా వ్యాప్తంగా 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు జిల్లాలో 67,489.480 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ.62.87 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోలు మరియు రవాణా ప్రక్రియ కొనసాగిస్తున్నామని చెప్పారు.జిల్లా నుంచి రోజుకు సుమారు 480 లారీల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే, వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే తడిసిన ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు.కొనుగోలు చేసిన ధాన్యం సురక్షితంగా నిల్వ ఉండేందుకు జిల్లాలో రెండు ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ధాన్యం తూకాల్లో పారదర్శకత కోసం పటిష్ట చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, జిల్లాలో 15,540 టార్పాలిన్లు, 668 తూకం యంత్రాలు, 278 ప్యాడీ క్లీనర్లు, 664 తేమ శాతం కొలిచే యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.రైతులు ప్రభుత్వ మద్దతు ధరకే తమ ధాన్యాన్ని విక్రయించి ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.

