ఏ2డిజిటల్ న్యూస్, మే 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో బక్రీద్ పండుగను ఆనందోత్సాహాలతో పాటు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బక్రీద్ పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సమాజంలో సౌభ్రాతృత్వం, ప్రేమ, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర పండుగ బక్రీద్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని సూచించారు. బక్రీద్ పండుగ త్యాగానికి, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. పేదలకు సహాయం చేయడం, అవసరమైన వారికి తోడ్పాటు అందించడం ద్వారా పండుగ సార్ధకమవుతుందని అన్నారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా మసీదులు, ప్రార్థనా స్థలాలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి పండుగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట స్వామి, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

