ఏ2డిజిటల్ న్యూస్, మే13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సి.వి ఆనంద్ ఆదేశాలు


బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.గోవుల అక్రమ రవాణా, గోవధ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ స్పష్టం చేశారు. పశువుల రవాణాకు సంబంధించి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర సరిహద్దులు, చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు, పశువుల రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో 24 గంటల నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే గోవుల రవాణా పేరుతో కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పోలీసు శాఖదేనని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాంటి పోస్టులు పెట్టే వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. మసీదులు, ప్రార్థనా స్థలాలు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మసీదులు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గోవుల అక్రమ రవాణాపై కఠిన నిఘా కొనసాగించాలని, చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని తెలిపారు.ప్రజలు పరస్పర సామరస్యంతో, సోదరభావంతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, ఆర్డీవో జయచంద్ర రెడ్డి, సీఐలు సందీప్ రెడ్డి, జాన్ రెడ్డి, మహేష్, రేణుక, రాజశేఖర్ రెడ్డి, కృష్ణ మూర్తి, సైదా నాయక్, ఎస్ఐ గంగా రాజు, వెటర్నరీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

