భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్

ఏ2 డిజిటల్ న్యూస్, మే 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత కీలకమని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. గురువారం ఎంపిక చేసిన రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి ఎన్నికకు ముందు ఓటరు జాబితాలను నవీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత అని ఆయన తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి అర్హత కలిగిన భారత పౌరుడు, ఆయా నియోజకవర్గంలో సాధారణ నివాసితుడై ఉండి, చట్టపరంగా అనర్హుడు కాకపోతే ఓటరుగా నమోదు కావచ్చని స్పష్టం చేశారు.యువ ఓటర్ల నమోదు, మహిళల భాగస్వామ్యం, దివ్యాంగులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇంటింటి సర్వేలు, పోలింగ్ స్థాయి అధికారుల పనితీరు, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణ ప్రక్రియలను ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత కాలపట్టికలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా గతంలో కూడా పలు మార్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు.ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్టోబర్ 27, 2025 నాటికి ఉన్న ఓటర్లందరికీ పాక్షికంగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.ఈ ఫారమ్‌ల సేకరణ కోసం బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించిన ప్రతి ఓటరిని ముసాయిదా జాబితాలో చేర్చుతామని, సరైన విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుంచి తొలగించరాదని స్పష్టం చేశారు.సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హై-రైజ్ భవనాలు, మురికివాడలలో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం వెబ్‌సైట్‌తో పాటు స్థానిక కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.పేర్ల చేర్పులు, తొలగింపులు, సవరణల కోసం ఫారమ్-6, ఫారమ్-7, ఫారమ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారుల అర్హతను విచారణ అనంతరం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తుది జాబితా ప్రచురణ తర్వాత అసంతృప్తి ఉన్నవారు జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

