
ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ఏ2 డిజిటల్ న్యూస్, మే15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి వరుస చోరీలు కలకలం రేపాయి. గ్రామంలోని తాళాలు వేసి ఉన్న నాలుగు ఇండ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలోని నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితులు తెలిపారు.ఘటన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు పోలీసులు పూర్తి అండగా ఉంటారని, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు. చోరీ ఘటనపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.గ్రామాల్లో రాత్రి పహారాను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ, వాటి ద్వారా చోరీలు మరియు అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు.అలాగే శుభకార్యాలు లేదా ఇతర పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సూచించారు. వీలైతే వాటిని తమ వెంట తీసుకెళ్లాలని, లేకపోతే నమ్మకస్తుల వద్ద లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రేణుక రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పెద్ద శంకరంపేట్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

