దేశ భవిష్యత్తు ప్రణాళికా రూపకల్పనలో జనగణన అత్యంత కీలకం : అదనపు కలెక్టర్ నగేష్

ఏ2డిజిటల్ న్యూస్, మే17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
హవేలీఘనాపూర్ మండలం బైతోలే గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. అనంతరం గ్రామంలోని హెచ్‌పిబి నెం.38లో జరుగుతున్న జనగణన పనులను కూడా ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన గోదాములకు తరలిస్తున్నామని, గోదాములకు చేరిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.అనంతరం జనగణన ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఎన్యూమరేటర్లతో మాట్లాడి నమోదు విధానాన్ని తెలుసుకున్నారు. హెచ్‌పిబి నెం.38లోని జనగణన ఎన్యూమరేటర్ మరియు సూపర్‌వైజర్‌కు సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలని ఆదేశించారు.దేశ భవిష్యత్తు ప్రణాళికా రూపకల్పనలో జనగణన అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం జరుగుతున్న 16వ జనగణన ఇదేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన కావడం విశేషమన్నారు. ఈసారి తొలిసారిగా డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నామని, ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే ‘స్వీయ గణన’ విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

