ఏ2డిజిటల్ న్యూస్, మే 19, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
జనగణన–2027 తొలి విడతలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.మంగళవారం రేగోడ్ మండల కేంద్రంలోని కొత్వాన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇండ్ల గణన ప్రక్రియను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లతో మాట్లాడిన కలెక్టర్, ఇంటింటి సర్వేను నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్వహించడం వారి ప్రధాన బాధ్యత అని తెలిపారు.మొబైల్ యాప్ ద్వారా స్పష్టమైన మరియు ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. మొదటి దశలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు.ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎండాకాలం దృష్ట్యా ఎన్యూమరేటర్లు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు.అలాగే ప్రజలు కూడా ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు ఎలాంటి దాపరికం లేకుండా సరైన సమాధానాలు ఇవ్వాలని కోరారు. ప్రజలు అందించే ఖచ్చితమైన సమాచారం ద్వారా ప్రభుత్వానికి సరైన గణాంకాలు అందుతాయని తెలిపారు.

