మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు పూర్తి చేస్తాం : కలెక్టర్ ప్రతిమా సింగ్
ఏ2డిజిటల్ న్యూస్, మే 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు సుమారు 65 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మిగిలిన కొనుగోళ్లను కూడా వచ్చే 10 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆమె పేర్కొన్నారు.ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని తెలిపారు.జిల్లాలో ఇప్పటివరకు 65 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మొత్తం 50,134 మంది రైతుల నుంచి 2,41,574.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 34,460 మంది రైతుల ఖాతాల్లో రూ.379.47 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన చెల్లింపులు కూడా ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు.గత నాలుగు రోజుల్లోనే 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, ధాన్యం నిల్వ కోసం జిల్లాలో 10 ఇంటర్మీడియట్ గోడౌన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుందని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని తెలిపారు.మరో 10 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోజువారీ లక్ష్యాల ప్రకారం మిగిలిన కొనుగోళ్లు పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. రైతులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

