ఏ2 డిజిటల్ న్యూస్, మే26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ధాన్యాన్ని వేగంగా అన్లోడింగ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మిల్లర్లకు సూచించారు. మంగళవారం తూప్రాన్ మండలంలోని నవదుర్గ రైస్ మిల్‌ను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా హమాలీలు, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని మిల్లర్లకు సూచించారు. అన్లోడింగ్ పనులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని, హమాలీలను షిఫ్ట్‌ల వారీగా పని చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం తూప్రాన్ గ్రామ శివారులో వరి ధాన్యం కొనుగోలు, నిల్వ కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ గిడ్డంగిని పరిశీలించారు. తూప్రాన్, వర్గల్, శివంపేట మండలాల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఈ గిడ్డంగిలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గిడ్డంగిలోని నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయా చంద్రారెడ్డి, డీఎం సివిల్ సప్లై అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.

