అజివిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన కింద ఎలక్ట్రిక్ ఆటో పంపిణీ
ఆటో నడిపిన అదనపు కలెక్టర్ నగేష్.. ప్రయాణించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని, వారు రవాణా రంగంలోకి ప్రవేశించడం శుభపరిణామమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ‘ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన (AGEY)’ పథకం కింద మక్తా భూపతిపూర్ గ్రామానికి చెందిన కె. సంధ్యారాణికి రూ. 3,35,000 విలువైన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక పథకం ద్వారా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు రవాణా రంగంలో ఉపాధి కల్పించి, వారి అదనపు ఆదాయానికి ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. మక్తా భూపతిపూర్ గ్రామంలో సరైన రవాణా సౌకర్యం లేదనే విషయం తన దృష్టికి రాగానే తక్షణమే స్పందించి ఈ ఎలక్ట్రిక్ ఆటోను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.లబ్ధిదారురాలి ఎంపిక:లబ్ధిదారురాలు సంధ్యారాణి గత రెండేళ్ల క్రితం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోగా, అధికారులు ఆమె దరఖాస్తును పరిశీలించి, అర్హురాలిగా గుర్తించి ఈ ఆటోను కేటాయించారు.ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అధికారుల ప్రయాణం:ఆటో పంపిణీ అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా ఆటో డ్రైవర్ సీట్లో కూర్చొని ఆటోను నడపగా.. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అందులో ప్రయాణికురాలిగా కూర్చొని ప్రయాణించారు. ఉన్నతాధికారులు ఇద్దరూ ఇలా సామాన్యుల్లా ఆటోలో ప్రయాణించడం అక్కడ ఉన్నవారందరినీ విశేషంగా ఆకట్టుకుంది.హాజరైన అధికారులు:ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్‌తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ రావు, అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సరస్వతి, డి.పి.ఎమ్ యాదయ్య, ఎ.పి.ఎమ్ నాగరాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

