ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమస్యలపై ఆరా
లారీలు, టార్పాలిన్ల ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు

ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం మెదక్ పట్టణంలోని దయరా పరిధిలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ నారాయణలతో కలిసి కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వాటిపై ఆరా తీశారు.ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు బ్లాక్ టార్పాలిన్లు అత్యవసరమని కోరారు.రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్తో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ రైతులకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు.ధాన్యం రవాణాకు అవసరమైన లారీల కొరతపై కూడా ఎస్పీ స్పందిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని రైతులకు తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. రైతుల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని, రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగంతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

