ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)


ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోచారంలోని డిబిసిలో శనివారం బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ డీపీఆర్‌ఓ రామచంద్రరాజుతో కలిసి ఆయన నాలుగు కిలోమీటర్ల బర్డ్ వాక్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా బర్డ్ వాక్ నిర్వహించామని తెలిపారు. పోచారం ప్రాంతం పక్షి వైవిధ్యం, సహజ వారసత్వానికి నిలయమని పేర్కొన్నారు. పోచారం జలాశయం, అభయారణ్యం పరిసర ప్రాంతాలు వలస నీటి పక్షులు, కొంగలు, ఐబిస్‌లు, బాతులు తదితర అనేక రకాల పక్షులకు ఆవాసంగా ఉన్నాయని చెప్పారు.పక్షుల జీవన విధానం, వలస పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. పక్షుల సంరక్షణ కోసం చెట్లు నాటడం, నీటి వనరులను కాపాడడం, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

