ఏ2 డిజిటల్ న్యూస్, జూన్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు) గోదాంను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగాయి.తనిఖీ సందర్భంగా గోదాం సీల్స్‌ను పరిశీలించిన కలెక్టర్, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను పరిశీలించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించిన కలెక్టర్, ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిరంతరం ఈవీఎం గోదాం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా 24 గంటలపాటు పకడ్బందీ భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్నామని, గోదాంలోని భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ గఫార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

