Wednesday, May 6, 2026
Home Blog Page 20

వదంతులు నమ్మొద్దు – మెదక్ జిల్లాలో గ్యాస్, ఇంధన కొరత లేదు: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్, మార్చి27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్, శుక్రవారం:మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. వదంతులను నమ్మకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఎల్పిజి గ్యాస్ సరఫరా సమృద్ధిగా కొనసాగుతోందని తెలిపారు. రోజుకు సుమారు 3000 సిలిండర్లు బుక్ అవుతుండగా, వాటికి 100 శాతం డెలివరీ జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని గ్యాస్ గోదాముల్లో సుమారు 3500 సిలిండర్లు నిల్వ ఉండగా, మరో 6500 సిలిండర్లు రవాణాలో ఉన్నాయని వివరించారు.అలాగే జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బంకులు, 16 ఎల్పిజి ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రోజువారీ అవసరానికి సరిపడా ఇంధనం నిల్వలో ఉందని, ప్రస్తుతం 550 కిలోలీటర్ల పెట్రోల్, 644 కిలోలీటర్ల డీజిల్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.కొన్ని బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల ప్రభావంతో ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్లే ఏర్పడుతున్నాయని చెప్పారు. అవసరం ఉన్నప్పుడే ఇంధనం తీసుకోవాలని సూచించారు.అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్, పోలీస్, రెవెన్యూ శాఖల సంయుక్త బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మెదక్ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేసి గృహ వినియోగానికి ఉద్దేశించిన 14.2 కేజీల 134 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి, 83 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ప్రజలు సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే నిర్ధారణలేని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని కలెక్టర్ సూచించారు.ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9391942254 ను సంప్రదించవచ్చని తెలిపారు.“వాస్తవాలను గ్రహిద్దాం… ఆందోళనను వీడుదాం. అవసరానికి మించి నిల్వలు చేయవద్దు” అని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

పెట్రోల్, డీజిల్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: ఎస్పీ

0

ఏ2టీవీ న్యూస్,మార్చి 26,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య వదంతుల వల్ల ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురవుతూ, పెట్రోల్ బంకులకు భారీగా వెళ్లి ఇంధనం నింపించుకునే ప్రయత్నం చేస్తున్నారని మంగళవారం తెలిపారు.జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు.అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగడంతో పాటు గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాలో నిర్ధారించని సమాచారాన్ని నమ్మకూడదని, వాటిని ఇతరులకు పంపకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.వదంతులు వ్యాప్తి చేసి ప్రజల్లో భయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

వృద్ధ దంపతులపై దారుణ దాడి.. 5 తులాల బంగారం దోపిడీ

0

సంఘటన స్థలాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

ఏ2టీవీ న్యూస్, మార్చి 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో మధ్యాహ్న సమయంలో దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి వృద్ధ దంపతులు అంజయ్య, సావిత్రి నివాసంలోకి ప్రవేశించి సుత్తితో దాడి చేసి, వారి వద్ద ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని బైక్‌పై పరారయ్యాడు.దాడిలో తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఘటనపై సమాచారం అందుకున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీతో పాటు డీఎస్పీ తూప్రాన్ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంక్ పనులను పరిశీలించిన అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

0

ఏ2టీవీ న్యూస్, మార్చి25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెట్రోల్ బంక్ నిర్మాణ పనులను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు.బుధవారం ఆవుసులపల్లి గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఈ పెట్రోల్ బంక్ పనులను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరమని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రదేశంలో ఉన్న పరిస్థితులను సమీక్షించి, అవసరమైన మౌలిక సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పెట్రోల్ బంక్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ఇంధన సౌకర్యం సులభంగా లభించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.అదనపు ఎస్పీ వెంట ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఆర్ఎస్ఐ మహిపాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం: సి.పి.ఎం

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 24,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఆడివయ్య హెచ్చరించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.భూ సమస్యలు, ఇండ్లు–ఇళ్ల స్థలాల సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, రోడ్ల దుస్థితి, ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. సంవత్సరం క్రితం వినతిపత్రం ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.వెల్దుర్తి, టేక్మల్, రేగోడ్, నిజాంపేట, రామాయంపేట, శివంపేట, చిలప్చేడ్ మండలాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో మార్పులతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, రోజుకూలి రూ.800కు పెంచి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో భూ వివాదాలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పలు గ్రామాల్లో రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు పోజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు మిగిలిన ఇళ్లను పేదలకు కేటాయించాలని అన్నారు.చేయూత పింఛన్లు రూ.4000 వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం60 టన్నుల ఇసుక సీజ్ – సాండ్ బజార్‌కు తరలింపు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్: ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీసు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా మెదక్ పరిధిలోని పసుపులేరు వాగు వద్ద గంగమ్మ గుడి, ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న మార్గాలను అధికారులు గుర్తించారు. వెంటనే ఆ మార్గాన్ని జేసీబీ సహాయంతో త్రవ్వి మూసివేశారు.అలాగే అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60 టన్నుల ఇసుకను గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను టిప్పర్ల ద్వారా మెదక్ సాండ్ బజార్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నెలవారీ నేర సమీక్షా సమావేశంరాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కేసులు నమోదు చేయాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా పోలీసు అధికారులతో కలిసి అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, (ఎన్‌బీడబ్ల్యూ) ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.ప్రతి కేసు స్థితిగతులను వివరంగా తెలుసుకొని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సున్నితమైన ఎస్సీ/ఎస్టీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.నేరాల నివారణలో భాగంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి రోడ్డు భద్రతను కాపాడాలని ఎస్హెచ్‌వోలకు ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధుల్లో రాత్రిపూట క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని వారికి అండగా నిలవాలని తెలిపారు. ప్రజల విశ్వాసం పెంపొందించేలా పోలీసులు విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు జార్జ్, రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, రేణుక రెడ్డి, జాన్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు, జిల్లా ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

రాజీయే రాజమార్గం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్‌లో ఉన్న వివాదాలను వేగంగా, సులభంగా పరిష్కరించుకునే మంచి అవకాశం ఇదని తెలిపారు.క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో పరస్పర చర్చల ద్వారా రాజీ సాధ్యమని చెప్పారు. దీని ద్వారా కోర్టు చుట్టూ తిరుగాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు.“రాజీయే రాజమార్గం” అంటూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి పోలీస్, కోర్టు సిబ్బంది కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

కల్తివి తినకండి…అనారోగ్యం పాలు కాకండి…! కంటతడి పెట్టిన డాక్టర్…!

0

ఏ2టీవీ న్యూస్,మార్చి23, ప్రత్యేక ప్రతినిధి (రాము)

ఆహార పదార్థాలు కల్తీవి తిని అనారోగ్యం పాలు కావద్దని, ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ రాజ్యమేలుతున్నందున ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని రోగులకు సూచిస్తూ ఓ వైద్యుడు కంటతడి పెట్టిన సంఘటన ఇది. కరీంనగర్ జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల టైం న్యూరో కేర్ ఆస్పత్రి డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ మంచి హస్తవాసి అన్న పేరు ఉంది. ఆ పెరుకు తగ్గట్టే ఆయన సాదాసీదాగా ఉంటూ తన వద్దకు అనారోగ్యంతో వచ్చే రోగులకు వైద్యం చేయడమే కాకుండా మనోధైర్యాన్ని నింపడం ఈయన కున్న ప్రత్యేకత. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా వైజాగ్, బెంగళూరు, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల్లో సైతం ఈయన పేషెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పక్షవాతం, నరాలకు సంబంధించిన వైద్యం చేయడంలో ఈయన సిద్ధహస్తుడు అన్న పేరు ఉంది. అయితే తన వద్దకు వచ్చే పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇస్తూఆరోగ్యసలహాలు,సూచనలుఅలాగేతినేపదార్థాలు మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు గురించి చక్కగా వివరించడం పేషెంట్లు విని ఆచరించడం కద్దు. అయితే ఈ మధ్య ఎంతకూ కల్తీ పదార్థాలు తినవద్దని తిని అనారోగ్యం పాలై చేతులారా అనారోగ్యాలను కొని తెచ్చుకోవద్దని పేషెంట్లకు సూచిస్తూ ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో అక్కడున్న పేషెంట్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరోవైపు మా మంచి కోరే డాక్టర్ అని సంతోషమూ వ్యక్తం చేశారు. ఇది కాస్త వీడియో తీసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వైరల్ అయ్యేసరికి నెట్టింట హల్చల్ చేస్తుంది. కల్తీ వల్ల మన ఆరోగ్యాలు ఎంతలా పాడవుతున్నాయో చెప్పకనే చెప్పినట్లు అవుతుందని పలువురుచర్చించుకుంటున్నారు

యాసంగి ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు: కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు

0

ఏ2టీవీ న్యూస్ మార్చి23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, పౌర సరఫరా తదితర శాఖలతో ఆమె చర్చించారు. ఏప్రిల్ 15 నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సీజన్‌లో 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 31.7 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, నర్సరీల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బాల్యవివాహాల నిరోధం, చిన్నపిల్లల పౌష్టికాహారం, తక్కువ బరువు ఉన్న పిల్లల గుర్తింపు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రజావాణి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ సహా అధికారులు పాల్గొన్నారు.