ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 2 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని జిల్లా పౌరసరఫరాధికారి నిత్యానంద్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.జిల్లాలోని 16 గ్యాస్ ఏజెన్సీలలో రోజుకు సగటున 3,200 సిలిండర్లు బుకింగ్ అవుతున్నాయని, వినియోగదారులకు 100 శాతం గ్యాస్ డెలివరీ నిరంతరంగా కొనసాగుతున్నదని చెప్పారు. ప్రస్తుతం డీలర్ల గోదాములలో 3,500 సిలిండర్లు అందుబాటులో ఉండగా, అదనంగా 6,179 సిలిండర్లు రవాణాలో ఉన్నాయని వివరించారు.గ్యాస్ కొరతపై కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్తలను ఖండించిన ఆయన, జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సమర్థవంతంగా పనిచేస్తూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ కొనసాగుతున్నదన్నారు.అదేవిధంగా, జిల్లా పరిధిలోని టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వాణిజ్య సంస్థలు కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. డొమెస్టిక్ సిలిండర్లను వాడినట్లయితే 6-A కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకుండా, అవసరమైన గ్యాస్‌ను సాధారణ విధానంలోనే పొందవలసిందిగా ఆయన కోరారు.





















