Sunday, July 5, 2026
Home Blog Page 6

యువశక్తితో మెదక్ క్రీడా సంబరాలు

0

యువజన క్రీడా – పర్యాటక వారోత్సవాలకు ఘన శ్రీకారం

ఏ2డిజిటల్ న్యూస్, మే 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చూడచక్కని పర్యాటక ప్రాంతాలకు నెలవుగా, ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెట్టింది పేరుగా మెదక్ జిల్లా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడా మరియు పర్యాటక వారోత్సవాలను ఈ నెల 18 నుండి 23 వరకు జిల్లా, మండల స్థాయిలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్‌చంద్ స్టేడియం వరకు నిర్వహించిన 5కే రన్‌ను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు సాగిన ఈ రన్ అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, స్థానిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లా పాలన సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు.యువత ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్, వ్యాయామాలను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యాయామం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఓర్పు, సహనం పెంపొందుతాయని తెలిపారు. గుండెజబ్బుల ప్రమాదం తగ్గి, ఊపిరితిత్తుల సామర్థ్యం, రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ భారతదేశంలో యువశక్తి అత్యధికంగా ఉందని, యువత ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. నేటి యువతే రేపటి భారత పౌరులని, శారీరక – మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇంత భారీ స్థాయిలో 5కే రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా యువతలో స్నేహభావం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని తెలిపారు. మెదక్ జిల్లా క్రీడాకారులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రాణించడం వెనుక వ్యాయామ ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 300 మందికి పైగా యువత 5కే రన్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి

0

దేశ భవిష్యత్తు ప్రణాళికా రూపకల్పనలో జనగణన అత్యంత కీలకం : అదనపు కలెక్టర్ నగేష్

ఏ2డిజిటల్ న్యూస్, మే17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

హవేలీఘనాపూర్ మండలం బైతోలే గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. అనంతరం గ్రామంలోని హెచ్‌పిబి నెం.38లో జరుగుతున్న జనగణన పనులను కూడా ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన గోదాములకు తరలిస్తున్నామని, గోదాములకు చేరిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.అనంతరం జనగణన ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఎన్యూమరేటర్లతో మాట్లాడి నమోదు విధానాన్ని తెలుసుకున్నారు. హెచ్‌పిబి నెం.38లోని జనగణన ఎన్యూమరేటర్ మరియు సూపర్‌వైజర్‌కు సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలని ఆదేశించారు.దేశ భవిష్యత్తు ప్రణాళికా రూపకల్పనలో జనగణన అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం జరుగుతున్న 16వ జనగణన ఇదేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన కావడం విశేషమన్నారు. ఈసారి తొలిసారిగా డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నామని, ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే ‘స్వీయ గణన’ విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం దిగుమతుల్లో అలసత్వం వీడాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని మిల్లర్లపై కఠిన చర్యలు

రెండు రైస్ మిల్లులు బ్లాక్‌లిస్ట్

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు: ప్రతిమా సింగ్

ఏ2డిజిటల్ న్యూస్, మే16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ధాన్యం దిగుమతుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు పీపీసీల నుంచి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకుని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.అయితే, కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాపన్నపేట మండలంలోని మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్ మరియు రామాయంపేట్‌లోని మేసర్స్ భవాని ఇండస్ట్రీస్ పీపీసీల నుంచి కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదని పేర్కొన్నారు.ఈ కారణంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. దీంతో సంబంధిత జి.ఓ నిబంధనల ప్రకారం పై రెండు రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్‌మెంట్ మరియు కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుంచి తక్షణ ప్రభావంతో బ్లాక్‌లిస్ట్ చేసినట్లు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా మిల్లులకు ఎలాంటి ధాన్యం కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ పీపీసీల నుంచి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, లేనిపక్షంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.

అక్కన్నపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రామాయంపేట, మే 16: రైతుల ధాన్యాన్ని సమయానికి తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఐకెపి (ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ జీఎం మార్కెటింగ్ అధికారి, ఆర్డీవో, డీఎంసీఎస్, డీఎస్ఓ, తహసీల్దార్, ఎంపీడీవోతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా టోకెన్ విధానం అమలులో ఉందా అనే అంశాన్ని ఆమె పరిశీలిస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే కేంద్రాల్లో గోనె సంచులు సరిపడా అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 1,32,992 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 533 కొనుగోలు కేంద్రాల్లో 519 కేంద్రాలు ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల కోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు.టోకెన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ధాన్యం తేమ శాతాన్ని నిర్బంధంగా పరీక్షించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల ధాన్యాన్ని ఆలస్యం లేకుండా తూకం వేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులు ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితులు రాకుండా కాంటాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అక్కడ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, రవాణా వివరాలను పరిశీలించిన కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజని, ఎంపీడీవో, సంబంధిత కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం నిల్వలో నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2 డిజిటల్ న్యూస్, మే15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యేక దృష్టి సారించారు.శుక్రవారం తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను పరిశీలించిన కలెక్టర్… ధాన్యం దెబ్బతినకుండా సక్రమంగా నిల్వ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కేటాయించిన రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు.తరలించిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకునేలా మిల్లర్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఇస్లాంపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అల్లాపూర్ గ్రామంలోని నవదుర్గా రైస్ మిల్లులో జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ప్రతిమా సింగ్… మద్దతు ధరకు నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతోందని తెలిపారు.కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, పొరపాట్లకు తావివ్వకూడదని అధికారులను హెచ్చరించారు.ప్రతిరోజూ కనీసం పది నుంచి పదిహేను లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్… అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు.ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, ప్రత్యేక అధికారి ఎల్లయ్య, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, మిల్లర్ల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

మిషన్ మోడ్‌లో ధాన్యం దిగుమతులు వేగవంతం చేయాలి

0

రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం

కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి

కేంద్రాలకు వచ్చే ధాన్యానికి అనుగుణంగా ట్రక్కులు సమకూర్చాలి

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు

ఏ2 డిజిటల్ న్యూస్, మే15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో కొనుగోలు చేసిన వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్‌లో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి నిర్వహించిన గూగుల్ మీట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ సింగ్, ఆర్డీవోలు, పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులు, గోదాములకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యానికి అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సరిపడా ట్రక్కులను సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిషన్ మోడ్‌లో వేగంగా మిల్లులకు తరలించాలని, దిగుమతుల విషయంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రాల్లో తూకం, రవాణా, గన్నీ బ్యాగుల సరఫరా, హమాలీల ఏర్పాటు వంటి అంశాల్లో అలక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైస్ మిల్లులు, గోదాములకు చేరిన ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచుకోవాలని తెలిపారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆధ్వర్యంలో హమాలీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.రోజుకు కనీసం పది నుంచి పదిహేను లారీల ధాన్యాన్ని దిగుమతి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం రవాణా, దిగుమతి ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ గూగుల్ మీట్‌లో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డీఎం పౌరసరఫరాలు జగదీష్, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

చిల్లపల్లి గ్రామంలో వరుస చోరీలు

0

ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2 డిజిటల్ న్యూస్, మే15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి వరుస చోరీలు కలకలం రేపాయి. గ్రామంలోని తాళాలు వేసి ఉన్న నాలుగు ఇండ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలోని నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితులు తెలిపారు.ఘటన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు పోలీసులు పూర్తి అండగా ఉంటారని, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు. చోరీ ఘటనపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.గ్రామాల్లో రాత్రి పహారాను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ, వాటి ద్వారా చోరీలు మరియు అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు.అలాగే శుభకార్యాలు లేదా ఇతర పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సూచించారు. వీలైతే వాటిని తమ వెంట తీసుకెళ్లాలని, లేకపోతే నమ్మకస్తుల వద్ద లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రేణుక రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పెద్ద శంకరంపేట్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మక్తా భూపత్‌పూర్ గ్రామంలో ఘనంగా పుట్టుపంచల వేడుకలు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా మెదక్ మండలంలోని మక్త భూపత్‌పూర్ గ్రామంలో ఆనందోత్సాహాల నడుమ నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ కుమార్తె, కుమారుడి పుట్టుపంచల వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఘనంగా సాగాయి. ఈ వేడుకలకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి చిన్నారులు ఉన్నత స్థాయికి చేరుకొని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో శైలేందర్‌తో పాటు నరేష్, సుభాష్, మహిపాల్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొని రాజశేఖర్ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించిన ఈ పుట్టుపంచల వేడుకలు ఆనందభరితంగా కొనసాగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకం

0

భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్

ఏ2 డిజిటల్ న్యూస్, మే 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత కీలకమని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. గురువారం ఎంపిక చేసిన రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి ఎన్నికకు ముందు ఓటరు జాబితాలను నవీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత అని ఆయన తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి అర్హత కలిగిన భారత పౌరుడు, ఆయా నియోజకవర్గంలో సాధారణ నివాసితుడై ఉండి, చట్టపరంగా అనర్హుడు కాకపోతే ఓటరుగా నమోదు కావచ్చని స్పష్టం చేశారు.యువ ఓటర్ల నమోదు, మహిళల భాగస్వామ్యం, దివ్యాంగులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇంటింటి సర్వేలు, పోలింగ్ స్థాయి అధికారుల పనితీరు, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణ ప్రక్రియలను ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత కాలపట్టికలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా గతంలో కూడా పలు మార్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు.ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్టోబర్ 27, 2025 నాటికి ఉన్న ఓటర్లందరికీ పాక్షికంగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.ఈ ఫారమ్‌ల సేకరణ కోసం బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించిన ప్రతి ఓటరిని ముసాయిదా జాబితాలో చేర్చుతామని, సరైన విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుంచి తొలగించరాదని స్పష్టం చేశారు.సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హై-రైజ్ భవనాలు, మురికివాడలలో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం వెబ్‌సైట్‌తో పాటు స్థానిక కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.పేర్ల చేర్పులు, తొలగింపులు, సవరణల కోసం ఫారమ్-6, ఫారమ్-7, ఫారమ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారుల అర్హతను విచారణ అనంతరం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తుది జాబితా ప్రచురణ తర్వాత అసంతృప్తి ఉన్నవారు జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

0

ఏ2డిజిటల్ న్యూస్, మే13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సి.వి ఆనంద్ ఆదేశాలు

బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.గోవుల అక్రమ రవాణా, గోవధ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ స్పష్టం చేశారు. పశువుల రవాణాకు సంబంధించి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర సరిహద్దులు, చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు, పశువుల రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో 24 గంటల నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే గోవుల రవాణా పేరుతో కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పోలీసు శాఖదేనని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాంటి పోస్టులు పెట్టే వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. మసీదులు, ప్రార్థనా స్థలాలు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మసీదులు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గోవుల అక్రమ రవాణాపై కఠిన నిఘా కొనసాగించాలని, చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని తెలిపారు.ప్రజలు పరస్పర సామరస్యంతో, సోదరభావంతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, ఆర్డీవో జయచంద్ర రెడ్డి, సీఐలు సందీప్ రెడ్డి, జాన్ రెడ్డి, మహేష్, రేణుక, రాజశేఖర్ రెడ్డి, కృష్ణ మూర్తి, సైదా నాయక్, ఎస్ఐ గంగా రాజు, వెటర్నరీ శాఖ అధికారులు పాల్గొన్నారు.