ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ధ్యాన్చంద్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని అన్నారు.కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ నరేష్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఫూలే ఆశయమని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు, నాయని బ్రాహ్మణి సంఘం అధ్యక్షులు ఉప్పల స్వామి, మాల మహానాడు గౌరవ అధ్యక్షులు మాసాయిపేట మల్లేశం, బి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా “అరైవ్ అలైవ్ వీక్” కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్న “అరైవ్–అలైవ్” కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు భద్రత సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసరమని అన్నారు. “అరైవ్–అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అధికారులపై ఉన్న ముఖ్య బాధ్యత అని సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు సహా స్థానిక ప్రజాప్రతినిధులను మరియు అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని తెలిపారు.ఈ నెల 13న అన్ని గ్రామపంచాయతీలలో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అలాగే రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి, వాటిలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించారు.రోడ్ల పక్కన ఉన్న గుంతలు, పాడుబడిన బావులను పూడ్చివేయడం, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.15వ తేదీన “చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే”గా నిర్వహించి, చిన్నపిల్లలకూ హెల్మెట్, సీట్ బెల్ట్ అవసరంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడడం, డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్‌పై ప్రచారం చేపట్టాలని సూచించారు. స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ కలిగి ఉండేలా చూడాలని పేర్కొన్నారు.16వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స అందించడం, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో కృషి చేసిన వారిని గుర్తించి సన్మానించాలని అన్నారు.18వ తేదీన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. అలాగే మండల స్థాయిలో జరిగే ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, ప్రధాన కూడళ్లలో మానవహారాలు నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో బ్లాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ రామస్వామి, సీఏ రాజేశ్వరి, వార్డు సభ్యులు కలిసి ప్రారంభించారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు, మహిళలు పాల్గొన్నారు.
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న “అరైవ్ అలైవ్ వీక్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని ఎస్పీ తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన 8–9 మంది సభ్యులతో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయనున్నారనీ, రిటైర్డ్ టీచర్లు, వైద్యులు, ఆశా/అంగన్‌వాడీ సిబ్బంది, యువజన సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులను సభ్యులుగా చేర్చి, కనీసం ముగ్గురు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రమాణ స్వీకారం నిర్వహించి, గుంతలు పూడ్చడం, ఓపెన్ వెల్స్ మూసివేయడం, పొదలు తొలగించడం వంటి చర్యలు చేపడతారనీ, అవగాహన కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, సురక్షిత రోడ్డు దాటే విధానంపై ప్రదర్శనలు నిర్వహిస్తారనీ, స్కూల్ ప్రాంగణాల్లో వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేసి హ్యూమన్ చైన్ కార్యక్రమాలు చేపట్టి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం చేపడతారనీ, డ్రైవర్ల లైసెన్సులు, వాహన పత్రాలు తనిఖీ చేసి ఆటో రిక్షాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారని చెప్పారు. ఓవర్లోడింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్‌పై కఠిన చర్యలుతీసుకుంటామని, రోడ్డు ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. పోలీస్, అంబులెన్స్ సిబ్బంది, వాలంటీర్లకు ఫస్ట్ ఎయిడ్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు జరిమానాల బదులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారనీ, స్కూల్ బస్సుల భద్రత తనిఖీలు చేసి, స్కూల్ జోన్‌లలో జీబ్రా క్రాసింగ్‌లు, సూచికలు ఏర్పాటు చేసి “స్లో డౌన్ – స్కూల్ జోన్” వంటి హెచ్చరికల ద్వారా విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సాధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. “స్పీడ్ తగ్గించు – జీవితం కాపాడు”, “జాగ్రత్తగా నడపు – సురక్షితంగా చేరుకో” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో విశేషమైన కార్యక్రమం జరిగింది. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్‌లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం (ఆయుష్ డే) సందర్భంగా యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివ దయాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.వశిష్ట యోగా కేంద్రం ప్రసిద్ధ యోగా గురువులు ఆకుల రవి, పతంజలి యోగ గురువు మనోరంజని పాల్గొని యోగ సాధనపై అవగాహన కల్పించారు.కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు.హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంలో కీలకంగా మారింది.
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో ఎయిడ్స్ (HIV/AIDS) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.గురువారం 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్ అవగాహన, నివారణ దినోత్సవం సందర్భంగా “రెడ్ రన్” వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డీసీఎచ్ఎస్ శివ దయాల్, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రామ్‌దాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ వాకథాన్‌లో ఎయిడ్స్ నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ పూర్తిగా నయం కాని వ్యాధి అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా దీని వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్త మార్పిడి, వాడిన సిరంజీల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అందువల్ల ప్రజలు సురక్షిత పద్ధతులను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.జిల్లాలో ప్రస్తుతం 385 హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో చికిత్స అందిస్తున్నామని, బాధితులు ఎటువంటి భయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని కలెక్టర్ తెలిపారు.రామ్‌దాస్ చౌరస్తాలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్‌గా తేలితే తగిన జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స పొందాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో, పట్టణాల్లో కళాజాతలు, ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ర్యాలీలో వైద్య అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ “ఎయిడ్స్ నివారణ” నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో రోడ్లు & భవనాల శాఖ (ఆర్ అండ్ బి), పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి శాఖ ద్వారా నిర్మాణంలో ఉన్న రహదారులు, కోర్టు భవనాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని తక్షణమే పరిష్కరించుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించి, పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ వేణు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ నరసింహులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రామాయంపేటలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించి, అక్కడి మౌలిక వసతులు మరియు విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి, వారికి పాఠాలు బోధిస్తూ వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థినుల ప్రతిభను అభినందించిన కలెక్టర్, నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలన్నారు.అలాగే పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.తదుపరి రేషన్ దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఏ2టీవీ న్యూస్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
మంగళవారం నర్సాపూర్ నియోజకవర్గ చిల్పిచేడ్ మండలంలో పర్యటించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్ ఈ సందర్భంగా మండల నాయకులతో కలిసి పార్టీ స్థితిగతులు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణ , చిల్పిచేడ్ మండల అధ్యక్షుడు నాగేష్ , సీనియర్ నాయకులు పాండురంగా రెడ్డి , మరియు మండల కమిటీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
ఏ2టీవీ న్యూస్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ( బుచ్చన్న)
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుంచి మా గ్రామానికి చెందిన ధారా యశోద ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందినందున ఆమెకు 31 500 రూపాయలు చెక్కును మంగళవారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకం నర్సింలు,మాజీ సర్పంచ్ వడ్ల లక్ష్మీపతి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజబోయినఅశోక్ ,ఉపాధ్యక్షుడు దార ప్రకాష్, పుల్లబోయిన నగేష్ ,వార్డ్ మెంబర్ ఎరుకల యాకోబు తదితరులు పాల్గొన్నారు.