ఏ2టీవీ న్యూస్, మార్చి 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా రైతులకు ఆయిల్ పామ్ పంట లాభదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామంలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటలను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్, పంట సాగు విధానం, దిగుబడి పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే ఆయిల్ పామ్ ద్వారా అధిక లాభాలు సాధ్యమని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను రైతులు వినియోగించుకోవాలని ఆమె అన్నారు. జిల్లాలో 2,500 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికే 2,000 ఎకరాల్లో సాగు జరుగుతోందని తెలిపారు.అలాగే ఆయిల్ పామ్ సాగు పరిశీలన కోసం ఈ నెల 20, 21, 22 తేదీలలో సిద్ధిపేట జిల్లాకు 70 బస్సుల్లో మెదక్ రైతులను పంపిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.



















